Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 4:45 pm Posted by : ramakrishna

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : భీంగల్ మండలం బడా భీంగల్, చెంగల్, బాబాపూర్, పల్లికొండ తదితర గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంటదివెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.

Additional Collector inspected grain purchase centres