న్యాయమూర్తి పై దాడికి నిరసన గా విధులు బహిష్కరించిన న్యాయవాదులు
నిజామాబాద్, బతుకమ్మ : నేర నిరూపణ అయిన దోషులు న్యాయమూర్తులతో హింస ప్రవృత్తితో ప్రవర్తించడాన్ని సహించబోమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాకోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న హరిష పై ఒక కేసులో నేర నిర్ధారణ అయిన దోషి దాడికి పాల్పడడం ఆందోళనకరమన్నారు. సదరు నేర ఘటనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ లో ఇలాంటి నేరపూరిత ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నేరమయ ముద్దాయిల పట్ల ముందస్తుగా సమాచారం తీసుకుని కోర్టులోకి భద్రత సిబ్బంది అనుమతించాలని తెలిపారు. సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, తుల గంగాధర్,గంగ ప్రసాద్,ఆశ నారాయణ, మద్దెపల్లి శంకర్ లు మాట్లాడుతు న్యాయమూర్తులు తమ విధినిర్వహణలో చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని తెలిపారు.సమావేశంలో పాల్గొన్న న్యాయవాదుల ఏకాభిప్రాయం మేరకు శుక్రవారం కోర్టుల విధులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో బార్ ఉపాధ్యక్షుడు పెండెమ్ రాజు,కార్యదర్శి సురేష్ దొన్పల్, న్యాయవాదులు దీపక్ మానిక్ రాజు, , బాగిర్తి సాయిరెడ్డి, సదానంద్ గౌడ్,రత్నాకర్ రెడ్డి, విగ్నేష్,తదితరులు పాల్గొన్నారు
ఇన్ ఛార్జి జిల్లా జడ్జికి వినతి పత్రం
జిల్లాకోర్టు ప్రాంగణంలోని రెండవ అంతస్తులోని ఒక కోర్టు గది వద్ద అపరిచిత వ్యక్తుల చర్యలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న నిమ్మకాయలు,పసుపు, కుంకుమలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ ఇన్ ఛార్జి జిల్లాజడ్జి కనక దుర్గాకు వినతి పత్రం అందజేశారు.