Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 11:07 pm Posted by : ramakrishna

రేషన్ బియ్యం దందాలో ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులపై చర్యలేవి

  • జిల్లాలో తంబ్ వేసి రేషన్ బియ్యం బదులు నగదు చెల్లింపు దందా
  • రేషన్ దుకాణాల నుంచి నేరుగా పీడీఎస్ మాఫియాకు బియ్యం సరఫరా
  • ఉమ్మడి జిల్లాలో డీలర్లపై , రేషన్ అధికారులపై చర్యలు శూన్యం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. చాలా మంది ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డులను తీసుకుంటున్నబియ్యాన్ని మాత్రం తీసుకోవడం లేదు. దారిద్రరేఖకు దిగువన ఉన్నారని(బీపీఎల్) కార్డు వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెల్సిందే. చాలా మంది రేషన్ కార్డు బియ్యాన్ని తీసుకోకుండా రేషన్ దుకాణాల్లో కేవలం వేలుముద్ర (తంబ్ ) వేసి కిలోకు రూ.10 నుంచి 12 తీసుకుని వదిలేస్తున్నారు. రేషన్ దుకాణాల వారు సంబంధిత బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.12 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారు. వాటిని సేకరించే పీడీఎస్ దందా నిర్వాహకులు రీసైక్లింగ్ కోసం లేదా మిల్లర్లకు నేరుగా అమ్ముకుని సొమ్ము చేసుకోవడం నిత్యం జరిగే తంతు.
నిజామాబాద్ జిల్లాలో ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా అక్కడి నుంచే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రేషన్ దుకాణాల డీలర్లు తమ వద్ద నిత్యం బియ్యం తీసుకునే వారి లెక్కలు తీసుకుని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణంలో ఉన్న కార్డుల ఆధారంగా రేషన్ తీసుకుని మిగిలిన వాటిని అక్కడి నుంచి అటే బహిరంగంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో నిజామాబాద్ డివిజన్ లో ఆరోపణలు రాగా నిజామాబాద్ డివిజన్ కు చెందిన నిర్వాహకున్ని ఆర్మూర్ కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు, నిర్వాహకులు కుమ్మకై రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఉన్న రేషన్ దుకాణాల వారికి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల 18 నుంచి 25లోపు రేషన్ డీలర్లు తమకు కావాల్సిన సరుకుల కోసం ఈఎండిలు చెల్లిస్తారు. వారికి మాత్రమే రేషన్ బియ్యం సరఫరా అవుతుంది. కానీ దీనిని అవకాశంగా తీసుకుని రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు వారి దగ్గర ఉన్న రేషన్ బియ్యం తినే వారి సంఖ్య ప్రకారం బియ్యాన్ని గోదాముల నుంచి దిగుమతి చేసుకుని మిగితా రేషన్ బియ్యంను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే తంతు నిత్యంగా జరుగుతుంది. ప్రధానంగా రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు, కొందరు రేషన్ డీలర్లు కుమ్ముకై బియ్యాన్ని ఎక్కడికక్కడ బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఈ దందా నిత్యంగా సాగుతునే ఉంది. ఈ నెల 12న నగరంలోని కొజ్జకాలనీలో దొరికిన రేషన్ బియ్యం సంచులు రేషన్ డీలర్ల నుంచి తీసుకున్నవేనని నిర్ధారించినప్పటికీ చర్యలకు మాత్రం ఉన్నతాధికారుల వైపు చూపెట్టడం గమనార్హం.