. . . మున్సిపల్ కమిషనర్ హయ్యూం
బిచ్కుంద, బతుకమ్మ :
కందర్పల్లి పరిధిలోని రిప్పుల్స్ పాఠశాల అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించబడిందని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పలువురు మున్సిపల్ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ హయ్యూం మాట్లాడుతూ, అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా, భారీ ఫీజులు వసూలు చేస్తూ నడుపుతున్న పాఠశాలలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేముందు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని, శాశ్వత భవనంలోనే పాఠశాల కొనసాగించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు జి.ఓ. నంబర్ 01, 91 ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఫిట్‌నెస్ ఉన్న స్కూల్ బస్సులు మాత్రమే వినియోగించాలని సూచించారు. పాఠశాల గుర్తింపు, ఫీజుల వివరాలు, ఉపాధ్యాయుల విద్యార్హతలు తప్పనిసరిగా నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. పాఠశాల పేర్ల బోర్డుల్లో “ఇంటర్నేషనల్”, “ఐఐటీ”, “సీబీఎస్ఈ” వంటి పదాలు అనుమతి లేకుండా వాడరాదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అమ్మకాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే సంబంధిత రిప్పుల్స్ పాఠశాల అనేక ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.