. . . మొదటి కౌన్సిల్ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
నగరంలోని అన్ని డివిజన్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. కనీస మౌలిక సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం ఇబ్బందికరం. అలాగే కార్పొరేటర్లకు సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ లో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. స్పెషల్ ఫండ్ లేకపోవడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాభారతి తదితర పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయన్నారు. అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

. . . యూడీఎఫ్ ఫండ్ కోసం కృషి
తెలంగాణలోనే అతిపెద్ద నగరంగా నిలిచిన నిజామాబాద్ కు అర్బన్ డెవలప్ మెంట్ ఫండ్ తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. యూడీఎఫ్ కింద రూ.400 కోట్లు వచ్చే అవకాశం ఉందని, ఇటీవలే ఇందుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేయించామన్నారు. అలాగే మరో కేంద్ర పథకం కింద రూ.200 కోట్ల కోసం కూడా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా నగరంలో యూజీడి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
. . . ఎజెండా కాదు తమ సమస్యలను వినండి : బీజేపీ కార్పొరేటర్లు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే యథాపలంగా కౌన్సిల్ ఎజెండాను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఈ సంధర్బంగా ఎజెండాను చదివి వినిపించే కార్యక్రమం షూరు కాగానే బీజేపీ కార్పొరేటర్లు పలు సమస్యలను ప్రస్తావించారు. ఎజెండాకు ముందు తమ సమస్యలను వినాలంటూ పట్టుబట్టారు. దీంతో కార్పొరేటర్ లందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ప్రధానంగా మురికి కాలువలు శుభ్రం చేసే కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పారు. ఏళ్లుగా ఉన్న సమస్యలపై ఎన్నిసార్లు వినతులు అందించిన అధికారులు స్పందించడం లేదని ప్రశ్నించారు. శానిటేషన్ చాలా పెద్ద సమస్యగా మారిందని ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుందన్నారు. జెసిబిలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదని, డీజిల్ కి మాత్రం బిల్లులు పెడుతున్నారన్నారు. యూజిడి పనులకు 180 మంది సిబ్బంది ఉండాల్సింది , 30 మంది మాత్రమే పనిచేస్తున్నారని , ఇలా అయితే పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు.
