Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 5:20 pm Posted by : ramakrishna

రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి

 

. . . ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్

 

రెంజల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల మోడల్ స్కూల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవినీతి, అక్రమాలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్ ఫిరోజ్‌పై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించి, ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెంజల్ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ అండతో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయని పేర్కొన్నారు. ఏబీవీపీ చేసిన ఆరోపణల ప్రకారం, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఏజెన్సీతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. అలాగే విద్యార్థుల హాజరు రికార్డుల్లో మార్పులు చేస్తూ రెండు వేర్వేరు రిజిస్టర్లు నిర్వహించడం, ఉపాధ్యాయుల సంతకాలను ఫోర్జరీ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం ఒకేషనల్ కోర్సుల కోసం విడుదల చేసిన నిధులను దారి మళ్లించి, ఇతర వ్యక్తి బ్యాంకు ఖాతా ద్వారా నగదు డ్రా చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని, పాఠశాల ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికివేసి పర్యావరణానికి నష్టం కలిగించారని కూడా ఏబీవీపీ ఆరోపించింది. ఈ అక్రమాలకు సంబంధించి ఉపాధ్యాయుల సంతకాల ఫోర్జరీ, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన విషయాలను ప్రిన్సిపాల్ స్వయంగా అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ విమర్శించింది. ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం ఉందని, విచారణ అధికారుల ముందు తమకు అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వాలని ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని కూడా ఏబీవీపీ ఆరోపించింది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని ఏబీవీపీ కోరింది. ప్రిన్సిపాల్ ఫిరోజ్‌ను విధుల నుంచి తొలగించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో రక్షిత్, చెర్రీ దీపాన్, సాయి, క్షేహిత్, శ్రీసాయి, శివ, సాయికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.