. . . డీఈఓకు బీసీ విద్యార్థి సంఘం వినతి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నందిపేట్ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ అన్నారు. ఈ మేరకు బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) అశోక్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు షిఫ్టింగ్ అనుమతి (షిఫ్టింగ్ పర్మిషన్), ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేవని ఆరోపించారు. అలాగే, విద్యార్థులను పాఠశాల బస్సుల్లో పరిమితికి మించి తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను జూలై 4 న సంబంధిత విద్యాశాఖ అధికారులు, నందిపేట్ ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, చిన్నపాటి వర్షానికే పాఠశాల ప్రాంగణం బురదమయంగా మారుతున్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన నిజమైతే గుర్తింపును రద్దు చేయాలని డీఈఓను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీను, అరవింద్, నందు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.