Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 6:02 pm Posted by : ramakrishna

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియ

  • తేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం లో అర్థశాస్త్ర విభాగాధిపతి  డాక్టర్ ఏ పున్నయ్య  ఆధ్వర్యంలో  ఎంపవరింగ్ ఇండియా  2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్  ” అనే అంశం పై జరిగిన రెండు రోజుల  జాతీయ సదస్సు కు ముగింపు  సమావేశానికి  ముఖ్యఅతిథి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కు సంబంధించి  ప్రపంచవ్యాప్తంగా  1992 లో 178  ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎర్త్ సమ్మిట్ నిర్వహించినాయన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని  ఆ సమ్మిట్ అభిప్రాయపడిందని,దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా  2000 సంవత్సరంలో మిలీనియం డెవలప్మెంట్  గోల్స్ ద్వారా పేదరికాన్ని  2015 నాటికి  తగ్గించాలని నిర్దేశించుకున్నారన్నారు. అనంతరం  2002లో  దక్షిణాఫ్రికాలో జరిగిన  ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు యందు  ప్రపంచ దేశాల స్నేహపూర్వక సంబంధాలతో సుస్థిర అభివృద్ధి సాధించాలని నిర్ధారించుకొని, 2012- 2013లో జరిగిన సదస్సుల యందు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల  నిర్ధారణ జరిగి జనవరి 2015లో 2030 నాటికి సాధించాల్సిన17 సుస్థిరాభివృద్ధి   లక్ష్యాలను ప్రకటించడమైందన్నారు. ఇదే దిశలో భారతదేశంలో కూడా  2047 నాటికి  సాధికారత గల భారతదేశంగా ఎదగడానికి  సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ధారించుకొని  వాటిని సాధించడానికి అనేక రకాల వ్యూహాలను ఏర్పాటు చేసుకోవడం అయిందన్నారు. ఈ రెండు రోజుల జాతీయ సదస్సును విజయవంతంగా పూర్తి చేసిన  డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్  కన్వీనర్ మరియు  ఆచార్యులను విద్యార్థులను అభినందించినారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు  ప్రొఫెసర్ రాణి రత్నప్రభ, చిట్టేడు  కృష్ణారెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆచార్యులు కే కృష్ణారెడ్డి  ప్రసంగిస్తూ ఈ రెండు రోజుల జాతీయ సెమినార్ పరిశోధక మరియు పోస్టు గ్రాడ్యుయేషన్  విద్యార్థులకు  ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ సెమినార్ లో చర్చించిన  అంశాలు వికసిత భారత్ కు మార్గ నిర్దేశం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి,  డాక్టర్ నాగరాజు పాత, డాక్టర్ స్వప్న  తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు వివిధ విశ్వవిద్యాలయాలనుండి వచ్చిన ఆచార్యులు, పేపర్ ప్రెజెంటర్స్  విద్యార్థిని విద్యార్థులు  పరిశోధకులు పాల్గొన్నారు.

Achieving the Sustainable Development Goals is a continuous process