నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ప్రయాణికుడి దగ్గర నుంచి ఎల్ ఈడీ టీవీలను ఎత్తుకెళ్లిన కేసులో మహారాష్ర్టలోని కిన్వట్ కు చెందిన శంకర్ నాగూరావును అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 26వ తేదీన ధర్మాబాద్ కు చెందిన మాధవప్ప నిజామాబాద్ లో 32 ఇంచుల రెండు ఎల్ఈడీ టీవీలు కొని స్వస్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చాడు. రాత్రి కావడంతో బుకింగ్ కౌంటర్ వద్ద టీవీలు పక్కన పెట్టుకొని నిద్రించాడు. ఈ క్రమంలో స్టేషన్ లోకి వచ్చిన శంకర్ నాగూరావు మాధవప్ప పక్కన ఉన్న రెండు టీవలను ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై శంకర్ నాగూరావు టీవీలను చేతిలో పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఐడీ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తాను టీవీలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ సుబ్బారెడ్డి, ఆర్ఎస్సై ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.