నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ విద్యా శాఖలో గత డీఈఓ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఏసీబీ నజరేసిందా అంటే.. ఔననే చెప్పాలి.. అందుకు గాను జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గత డీఈఓ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబ్బందిని ఆరా తీయడం కలకలం రేపింది. ప్రధానంగా గతేడాది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన గ్లోబల్ ఫౌండేషన్ పై ఎఫ్ఐఆర్ తరువాత జరిగిన పరిణామాలపై వివరాలు అడిగినట్లు సమాచారం. గత డీఈఓ హాయంలో ప్రస్తుతం సర్వ శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న ఒక అధికారి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే పాఠశాలల్లో గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 23 మంది బోధనేతర సిబ్బంది నియమకాలకు డబ్బులు వసూలు చేశారు. 15మందిని నియమించగ రాజు అనే నిర్మల్ ఏజెంట్ ద్వారా జరిగిన నియామకాలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఆ వ్యవహారం అటకెక్కింది. గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహాకులను తప్పించేందుకు సర్వ శిక్షా అభియాన్ లో పని చేసే అధికారి లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన మరొక ఏజెంట్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చినట్లు సమాచారం. ఈ వ్యవహారం మొత్తాన్ని ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో విద్యా శాఖలో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఎలాంటి అనుమతులు లేకుండానే విదేశాలు వెళ్లొచ్చారు. గల్ఫ్ దేశాలతో పాటు యూరప్ లో ఉన్నప్పడు కూడా వారికి పూర్తి స్థాయి వేతనాలు అందించిన ఘనత జిల్లా విద్యా శాఖ అధికారులు మూట గట్టుకున్నారు. వారితో పాటు కొందరు బిజినెస్ టీచర్లుగా పేరుబడిన ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకులు లీడర్ల ముసుగులో పాఠశాలలకు వెళ్లకుండానే వేతనాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు కొందరు గత జిల్లా అధికారి హయాంలో జరిగిన అవినీతి అక్రమ నియామకాలపై విద్యా శాఖతో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం.