Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 5:14 pm Posted by : ramakrishna

నారాయణ కాలేజ్ ఎదుట ఏబీవీపీ ధర్నా

 

. . . కళాశాలను సీజ్ చేసిన డిఐఇఓ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నారాయణ కళాశాలలో యూనిఫార్మ్స్, బుక్స్ అధిక రేట్లకు అమ్ముతున్నారు. కార్పొరేట్ ఫీజులు పేరిట విద్యార్థుల, తల్లిదండ్రుల రక్తాన్ని పిలుస్తున్నారు. కళాశాల బిల్డింగ్ పర్మిషన్ లేకున్నా కళాశాల నడుపుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్న నారాయణ కళాశాల ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆందోళనకు దిగింది. శుక్రవారం సుభాష్ నగర్ లోని నారాయణ కాలేజ్ ఎదుట ఏబీవీపీ నిరసన తెలిపింది. విషయం తెలిసిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ కాలేజ్ మొత్తాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ… జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చల విడిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

 

ABVP stages protest in front of Narayana College.

 

కళాశాల ప్రాంగణాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, షూస్ వంటివి విక్రయిస్తూ, బయట మార్కెట్ కంటే రెట్టింపు ధరలకు అమ్ముతూ తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. కొత్త విద్యా  సంవత్సరం ప్రారంభం కాకముందే, సీట్లు అయిపోతాయనే కృత్రిమ భయాన్ని సృష్టించి అడ్మిషన్ల పేరిట వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పై టాస్క్‌ ఫోర్స్ కమిటీలతో తక్షణమే తనిఖీలు చేపట్టాలి. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కళాశాల గుర్తింపును రద్దు చేయాలి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కేవలం విద్య బోధనకు సంబంధించిన ఫీజులు మాత్రమే వసూలు చేసే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. విద్యార్థుల భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ విక్రయాలు, ముందస్తు అడ్మిషన్లు దోపిడీని అరికట్టాలని, లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని శశిధర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ మందపల్లి అక్షయ్, సమీర్, దుర్గా దాస్, సిద్దు, మున్నా, ప్రణీత్ తేజ, శివ, టిల్లు, సన్నీ, అశ్విత్, విగ్నేష్, చరణ్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

 

ABVP stages protest in front of Narayana College.