Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 3:47 pm Posted by : ramakrishna

నాలుగు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే..

. నిప్పులు కక్కుతున్న భానుడు

. నిజామాబాద్ జిల్లా సీహెచ్ కొండూర్ లో అత్యధికంగా 45.3 డిగ్రీలు

. మండుతున్న ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్

. ఎనిమిది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైనే నమోదు

నిజామాబాద్, బతుకమ్మ: భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ లో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ర్టంలోని 33 జిల్లాలకు గాను ప్రతి జిల్లాలో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. గురువారం రోజున నిజామాబాద్ తోపాటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో 44.9 డిగ్రీలు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో 44.8 డిగ్రీలు నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో 42 నుంచి 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు.

Above 45 degrees in four districts..

మండుతున్న ఇందూరు
నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఏప్రిల్ నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 2005 మే నెలలో అత్యధికంగా 47.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గతేడాది మే 15 నుంచి 25వ తేదీ మధ్య అత్యధిక ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలు నమోదైంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లోనే 45 డిగ్రీలు దాటడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11గంటల నుంచి ప్రజలు ఇళ్లకు పరిమితమవుతున్నారు. సాయంత్రం 5గంటలు దాటినా బయటికి రాలేకపోతున్నారు. ప్రధాన రోడ్లు మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చే వారు వేడి నుంచి ఉపశమనం కోసం నానా తిప్పలు పడుతున్నారు. మరో వైపు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పెరుగుతుండడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గతేడాది ఇదే రోజు 43.3 డిగ్రీలు
గత సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 43.3 డిగ్రీలు నమోదు కాగా ప్రస్తుతం 45.3 డిగ్రీలు నమోదైంది. సాధారణంతో పోలిస్తే సుమారు మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదువుతోంది. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. గతేడాది ఇదే రోజున 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గురువారం 44.8 అంటే సుమారు మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, నస్రుల్లాబాద్, సోమార్, మేనూరు గ్రామాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

ఎండతీవ్రత.. వేడి గాలులు..
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రాబోయే రోజుల్లో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తరచూ నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎండ తీవ్రతకు వేడిగాలులు తోడుకావడంతో రోజువారి కూలీలు, వీధి వ్యాపారులు పనివేళల్లో పని మానేశారు.