. . . సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు
జుక్కల్, బతుకమ్మ :
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాహ్మదాబాద్ గ్రామంలో రైతులు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణదేవుడి అనుగ్రహం కలగాలని కోరుతూ గ్రామదేవతలకు జలాభిషేకం చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభంలో కురిసిన స్వల్ప వర్షాలను నమ్ముకొని పెసర, మినుము, కంది, పత్తి, సోయాబీన్ తదితర పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేశామని తెలిపారు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పాటు ఎండ తీవ్రత పెరగడం, ఈదురుగాలుల ప్రభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురిసి పంటలు కళకళలాడాలని గ్రామదేవతలను ప్రార్థించినట్లు రైతులు తెలిపారు. ప్రకృతి అనుకూలిస్తేనే రైతుల శ్రమకు ఫలితం దక్కుతుందని, ప్రభుత్వం కూడా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. గ్రామంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో రైతులు, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామదేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, గ్రామానికి సకాలంలో వర్షాలు కురిసి సస్యశ్యామలంగా మారాలని ప్రార్థించారు.