Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 12:12 am Posted by : ramakrishna

పదోన్నతుల్లో ఆగమాగం

  • నోరేళ్లబెట్టిన కమిటి
  • ఎటూ తేలని ఆర్మూర్ పంచాయతీ
  • సరి చేసేందుకు బృందం తలమునకలు

నిజామాబాదు, బతుకమ్మ:

డిచ్ పల్లి డివిజన్ విభజన ప్రక్రియ అధికారులకు పరిహాసంగా మారింది. సిబ్బందిని ఆప్షన్స్ ప్రకారం పంపిస్తామని చెప్పి జాబితాను వెలువరించారు. తప్పుల తడకల ఉందని సిబ్బంది అగ్గి మీద గుగ్గిలమవడంతో, దీనిని సరి చేసేందుకని కమిటిని వేసారు. నిజనిజాలు తెలుసుకొని న్యాయం చేద్దామని వెళ్ళిన బృందానికి అక్కడి విషయాలను చూడగానే దిమ్మ తిరిగినట్లయ్యింది. ఇది తమ వల్ల కాదని చేతులెత్తేసి, అదే విషయాన్ని నివేదిక రూపంలో ఎస్ఈకి అందజేసినట్లు తెలిసింది.

  • డివిజన్ ఆగమాగం..

సీనియారిటి ప్రకారం ఇవ్వాల్సిన పదోన్నతులను పుట్నాలు పంచినట్లుగా, తమకు అనుకూలమైన వారికి, చేతులు తడిపిన వారికి ఇచ్చుకున్నారు. దీని కోసం కమిటి ఉన్నప్పటికీ, పెద్ద అధికారి ముందు మింగలేక, కక్కలేక చెప్పింది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పదోన్నతులు కొందరికి ప్రయోజనం చేకూరగా, ఇంకొందరికి నష్టం వాటిల్లేలా చేసింది. సిరికొండ మండల పరిధిలో పని చేసిన ఉద్యోగి తప్పులో ఇరుక్కున్నాడు. దీనికి గాను సంస్థ కొన్ని నెలల పాటు విధులకు దూరంగా ఉంచింది. అక్కడి నుంచి ఆర్మూర్ కు వచ్చిన తర్వాత పదోన్నతి తీసుకున్నాడు. ఇది విరుద్దమైన చర్య అని తెలిసి చేయడంతో, ఇతనికన్నా ముందు ఉన్న వారు సీనియారిటీ జాబితాలో వెనక్కి జరిగారు.

  • పదోన్నతుల్లో పదనిసలు …

జిల్లాలోని విద్యుత్ శాఖలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లు ఉన్నాయి. రెండు డివిజన్లు మినహా ఆర్మూర్ లో చాలా ఏళ్ల నుంచి పదోన్నతుల్లో పదనిశలు పొడసూపుతున్నాయి. హోదా, సీనియారిటీ ననుసరించే గాకుండా, రోస్టర్ ప్రకారం కమిటిలో నిర్ణయం తీసుకున్నాకే పదోన్నతులు కల్పిస్తుంటారు. అభ్యంతరాల స్వీకరణ కోసం డివిజన్ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శిస్తుంటారు. సిబ్బంది నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుంటే, దానినే డిపిసిలో ఆమోదం తెలుపుతారు. ఈ తతంగం అంతా ఉండగా, దీనిని విస్మరించి ఆర్మూర్ లో 2003 నుంచి పదోన్నతులను పక్కదారి పట్టించారని సిబ్బంది మండిపడుతున్నారు. గతంలో పని చేసిన అధికారికి తప్పులు దొర్లిన దానిపై కంపెనీ సిఎండి షోకాజ్ (సంజాయిషీ) నోటీస్ జారి చేయగా, విరమణ పొందిన ఉద్యోగికి రావ్వాల్సిన బెనిఫిట్స్ నుంచి క్రమ శిక్షణ చర్యల కింద కొంత మేర కోత విదించారని అప్పట్లో ప్రచారం జరిగింది.

  • నోరెళ్ళబెట్టిన కమిటి…

డివిజన్ విభజన కోసం వెలువరించిన జాబితాపై ఆక్షేపణలు రావడంతో ఎస్ఏఓ అద్వర్యంలో కమిటిని వేసారు. వారం గడువు లోపల సీనియారిటీ జాబితాను సరి చేసి నివేదికను ఇవ్వాలని ఎస్ఈ ఆదేశించారు. నిజనిర్ధారణ బృందం ఆర్మూర్ డివిజన్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు చూసి నోరెళ్ళబెట్టారని తెలిసింది. ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని గ్రహించి, ఎస్ఈ ఆద్వర్యంలో కంపెనీకి సమాచారం చేరవేసినట్లు తెలిసింది. డివిజన్ పరిధి అగమాఘంగా ఉందని, సిబ్బందికి అన్యాయం జరగకుండా అక్కడే సరి చేసుకోవాలని కంపెనీ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. పదోన్నతులను తారుమారు చేయడంలో అకౌంట్స్ విభాగంలోని ఉద్యోగి చేతివాటం ఉందని పసిగట్టిన ఎస్ఏఓ, తన చాంబర్ కు పిలిపించుకొని చివాట్లు పెట్టినట్లు తెలిసింది. డిపిసికి విరుద్ధంగా పదోన్నతులు కల్పించేందుకు, ఆర్మూర్ కు వెళ్లి సహకరించడంలో ఉద్దేశమేంటని కమిటి చైర్మెన్ సందించిన ప్రశ్నలకు గాను బాద్యులకు తడబాటే మిగిలిందని పవర్ హౌస్ లో ప్రచారం జరుగుతోంది. నిజనిర్ధారణ బృందం చైర్మెన్ అద్వర్యంలో విచారణ వేగం పుంజుకోవడంతో, పదోన్నతుల్లో దొర్లిన తప్పులను సరి చేసి న్యాయం చేస్తారనే నమ్మకం ఆర్మూర్ డివిజన్ సిబ్బందిలో ప్రస్పుటమవుతుంది. వారం గడిచింది, కమిటి జాబితాను అందజేసిందా అని ఎస్ఈ రవీందర్ ను ఫోన్ ద్వారా బతుకమ్మ సంప్రదించగా, ఆర్మూర్ డిఈ కి ఇస్తారు, డివిజన్లోనే ప్రదర్శిస్తుంటారని దాటవేతగా చెప్పడం గమనార్హం.