Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2024, 7:45 pm Posted by : ramakrishna

రూరల్ పోలీస్ స్టేషన్ లో యువకుడి ఆత్మహత్యాయత్నం

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి ఎస్సై చాంబర్ లోనే ఫ్లెక్సీతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రమేష్ ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసువచ్చినట్లు తెలిసింది. ఎస్సై నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. నిజామాబాద్ నగర శివారులోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరుగడం కలకలం రేపింది. నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వోగా ఉన్న మహేష్ ను భీంగల్ కు బదిలీ జరిగినా ఇంకా అధికారులు రిలీవ్ చేయలేదు. అంతలోనే ఈ అఘాయిత్యం జరుగడం గమనార్హం. రమేష్ పై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ అయిందా లేక విచారణ నిమిత్తం రప్పించి వేదించారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో సివిల్ పంచాయితీలు, భార్యభర్తల వివాదాల్లో పోలీస్ స్టేషన్ లకు రప్పించి సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సమయంలో రమేష్ ఆత్మ హత్యాయత్నం కలకలం  రేపింది. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రమేష్ ఆత్మ హత్యాయత్నంకు గల కారణాలపై పోలీసు అధికారులెవ్వరూ స్పందించలేదు.  రమేష్ చెబితే కానీ ఆత్మహత్యకు గల కారణాలు, కారకులు ఎవరనేది వెల్లడయ్యే అవకాశం ఉంది.