Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 10:24 pm Posted by : ramakrishna

ఆ అధికారిపై విజిలెన్స్ కన్ను

  •  ఇటీవల వరుస ఆరోపణల నేపథ్యంలో విచారణ
  • బయటకు పొక్కనివ్వని యంత్రాంగం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల విజిలెన్స్ అధికారులు విచారణ జరిపిన వ్యవహరం వెలుగులోకి వచ్చింది. బతుకమ్మ దినపత్రికలో వచ్చిన కథనాల నేపథ్యంలో ఒక శాఖకు చెందిన అధికారి, యూనియన్ నేత వ్యవహర శైలిపై నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాయి. దాంతో విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిపినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా కదలకుండా ఉండి సామాజిక వర్గం అండతో యూనియన్ నేతగా చక్రం తిప్పుతున్న సదరు అధికారి పోస్టింగ్ వ్యవహరం వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రోసిడింగ్ లేకుండానే పోస్టింగ్ వ్యవహరం చర్చనీయాంశమైంది. సదరు అధికారి పేరుకు ప్రభుత్వ ఉద్యోగిగా చెలామణి అవుతునే రియాల్టర్ గా, బిల్డర్ గా వ్యవహరిస్తున్నాడని జగమెరిగిన సత్యం. సంబంధిత శాఖలో ఏనాడు కుర్చీలో కనబడకుండానే సొంత పనులు చక్కబెట్టుకోవడంలో సిద్దహస్తుడిగా పేరు గడించాడు. ప్రభుత్వం ఏదైనా, అధికారులు ఎవరైనా వారితో సఖ్యత కొనసాగిస్తూ పదవులను కాపాడుకోవడమే అతని నైజంగా ప్రసిద్దికెక్కాడు. గతంలో యూనియన్ లీడర్లుగా పని చేసిన అధికారులు యూనియన్ కార్యకలాపాలను చక్కబెడుతునే విధులకు హాజరయ్యే వారు. కానీ ఇటీవల కాలంలో సదరు సారు ఎన్నికలు నిర్వహించకుండా తమ కార్యవర్గాన్ని కొనసాగించడం కూడా సొంత శాఖ ఉద్యోగులకే నచ్చలేదు. ఎన్నికల కోడ్ సమయంలో కొందరినీ కదపకుండా చాలా మందిని సొంత జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పంపించడంలో సారు పాత్ర ఎనలేనిది. గతంలో పని చేసిన జిల్లా పాలనాధికారులను, ముఖ్యంగా తమ శాఖపై పెత్తనం చేసే అధికారులను గుప్పెట పెట్టుకుని నగర శివారులో రియల్ ఎస్టేట్ దందా చేశాడనేది ప్రతీతి. ప్రభుత్వ భూములను కూడా ఎన్ వోసీ ఇప్పించుకుని స్వాహా చేశాడని ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో సొంత శాఖలో అధికారులు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా తాను కోరుకున్న వారికే తాను చెప్పినట్లు విన్న వారికే ప్రాధాన్యమైన పోస్టులు ఇచ్చారని లేకపోతే సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ లు ఇప్పించారనే చర్చ జరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఏ శాఖలో లేని విధంగా ఒకే శాఖలో ఏళ్ళ తరబడి ఉండి యూనియన్ నేతగా అనుకున్నది అనుకున్నట్లుగా చేసిన సదరు నేత తీరుపై బతుకమ్మలో వచ్చిన కథనాలకు నిఘా వర్గాల సమాచారంతో విజిలెన్స్ విచారణ జరిగినట్లు తెలిసింది. సంబంధిత నివేదికను ఆయా శాఖ అధిపతులకే పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలు విజిలెన్స్ విచారణ అంశాన్ని సదరు అధికారి అధికార పార్టీ నేత వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. కావాలని తనపై బురద చల్లుతున్నారని ఈ విషయంలో తనకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. సొంత శాఖలోని ఉద్యోగులను ముందుపెట్టి తన దందాలు, తన వ్యాపకాలను సరిపెట్టుకుంటున్న అధికారి తీరుపై విజిలెన్స్ విచారణ జరుగడం ఆ శాఖలోనూ కలకలం రేపింది.