Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 4:56 pm Posted by : ramakrishna

భూభారతి దరఖాస్తులపై సమగ్ర విచారణ జరపాలి

  • కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద రైతులు, ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపిన మీదట, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూ భారతి పైలెట్ ప్రాతిపాదికన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎనిమిది గ్రామాలలో నిర్వహించిన రైతు సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. శుక్రవారం ఆర్మూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశమై భూభారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 5 నుండి 8వ తేదీ వరకు మెండోరా మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల సందర్భంగా 706 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలని హితవు పలికారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భూభారతిలోని నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్నప్పుడే, తప్పిదాలకు తావులేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించగల్గుతారని అన్నారు. ముందుగా డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తులో వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టినందున ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా, విచారణ ప్రక్రియను పూర్తి నిబద్ధత, నిజాయితీగా నిర్వహించాలని సూచించారు. అందులోనూ పైలట్ ప్రాతిపదికన నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కావడం వల్ల అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంటుందని, ఏ చిన్న అవకతవకలకు తావు కల్పించినా ప్రభుత్వ యంత్రాంగానికి, రెవెన్యూ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా భూభారతి దరఖాస్తుల విచారణలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హితవు పలికారు. కావాలని తప్పిదాలకు తావు కల్పిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థను అమలు చేస్తున్నందున, ప్రతి దరఖాస్తును ఎంతో జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుందని, దరఖాస్తుదారుడు తిరిగి అప్పీలుకు వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాకుండా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ జరిపి వాస్తవ పరిస్థితులతో కూడిన అభిప్రాయాలను నివేదికలో పేర్కొనాలి కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ ప్రక్రియలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరు సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. సాదాబైనామాలు, పీ.ఓ.టీ దరఖాస్తులకు సంబంధించి రికార్డుల పరిశీలన, సాధారణ విచారణలు మాత్రమే జరపాలని, హైకోర్టులో స్టే తొలగిన మీదట, ప్రభుత్వం వెలువరించే మార్గదర్శకాలకు అనుసరిస్తూ సాదాబైనామా, పీ.ఓ.టీలను క్రమబద్దీకరించడం జరుగుతుందని దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒకే దరఖాస్తులో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలను పొందుపరిస్తే, ప్రతి సమస్యను తప్పనిసరిగా పరిశీలిస్తూ వేర్వేరుగా విచారణ జరపాలని అన్నారు. ఈ నెల 12 నుండి దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియలు చేపట్టి, వారం రోజుల్లో పూర్తి చేయాలని, ఈ నెల 20 వ తేదీ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని దరఖాస్తుల విచారణ పూర్తి కావాలని రెవెన్యూ బృందాలకు గడువు విధించారు. క్షేత్రస్థాయి విచారణలో జాప్యానికి తావులేకుండా ఇతర మండలాల సర్వేయర్ల కూడా పైలెట్ మండలానికి కేటాయిస్తామని, రెవెన్యూ బృందాలు సమన్వయంతో పని చేస్తూ నిర్ణీత గడువులోపు దరఖాస్తుల పరిశీలన, విచారణలు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

A thorough investigation should be conducted into the land acquisition applications.