Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 6:20 pm Posted by : ramakrishna

ఏకలవ్య విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

 

. . . పీడీఎస్ యూ డిమాండ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి మృతిపై వివరాలు సేకరించడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్ యూ) నాయకులు ఏకలవ్య పాఠశాలకు వెళ్లడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పాఠశాల అధికారులు అడ్డుకున్నారు. విద్యార్థి మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడి విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ మాట్లాడుతూ, ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థి నిన్న ఉరి వేసుకుని మృతి చెందడం జరిగిందన్నారు. విద్యార్థి మృతిపై విద్యార్థి తల్లిదండ్రులు అక్కడి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ హాస్టల్లల్లో విద్యార్థులు ఆత్మహత్యతోనో, అనుమానస్పదంగానో చనిపోతున్నారన్నారు. కానీ ప్రభుత్వం నుండి నివారణ చర్యలు సమగ్రంగా లేవన్నారు. ఇప్పటికైనా అన్ని గురుకుల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఆత్మహత్యల ఘటనలు ప్రభుత్వ స్కూల్లల్లోనూ జరగడం బాధాకరమన్నారు. ఈ ఘటనలకు శాస్త్రీయ పద్ధతుల్లో నివారణ చర్యలు ఆలోచించాలన్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనీ, సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నా, నవీన్, జీవన్ లు పాల్గొన్నారు.