Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:14 pm Posted by : ramakrishna

బోర్లo ఎస్సీ గురుకుల విద్యార్థి సంగీత మృతి పై సమగ్ర విచారణ చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత మరణంపై సమగ్ర విచారణ జరపాలని భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి సంగీత మృతి అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, రాత్రి సమయంలో విద్యార్థులను బయటకు ఎందుకు పంపించారో స్పష్టమైన సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థులతో పనులు చేయించటం, శ్రమకు గురి చేయడం అమానుషం, సిగ్గుచేటు అని తీవ్రంగా ఖండించారు. గురుకుల పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. వెంటనే సంబంధిత ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం సంపూర్ణంగా అండగా నిలవాలని కోరారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా గురుకుల వ్యవస్థపై ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు.