Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 4:11 pm Posted by : ramakrishna

బీసీల స్థితిగతులపై అధ్యయనం జరగాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీసీల జనగణన, వారి స్థితిగతులపై అధ్యయనం జరగాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.  కలెక్టరేట్ లో మంగళవారం బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ నిరంజన్ కు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పడిన తరువాత బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ అలా జరగలేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం  బలహీనవర్గాల సంక్షేమం కోసం పని చేస్తోందని, బీసీ కమిషన్ ను నియమించడమే ఇందుకు నిదర్శనమన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలని, స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి అన్నారు. నిధుల్లో వాటాను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుల వృత్తుల వారందరికీ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం అన్నిజిల్లాల్లో స్టడీ సర్కిల్ లు ఏర్పాటు చేయాలని కోరారు. సంచార జాతుల కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. గల్ఫ్ కు వెళ్లేవారికి న్యాక్ ద్వారా స్కిల్ శిక్షణ ఇస్తే వారికి అక్కడ మంచి వేతనం దక్కుతుందన్నారు. జనాభా దామాషా ప్రకారం బడుగు బలహీన వర్గాల వారందరికీ వాటా రావాలన్నదే రాహుల్ గాంధీ ఉద్దేశమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ లో జరిగిన అవకతవకలపై విచారణ చేయించాలని కోరారు. ఎన్డీసీసీబీ చైర్మన్ తారాచంద్ నాయక్, బీసీ నాయకుడు ఆదె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


A study should be done on the status of BCs