Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 6:36 pm Posted by : ramakrishna

నిర్దేశిత కార్యచరణ ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలి

 

. . . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారత ఎన్నికల సంఘం నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి అర్హులైన ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, పూరించిన తర్వాత సేకరించాలని, ఫారాల పంపిణీ ప్రక్రియను జూలై 1వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రతి రోజూ పురోగతి నివేదికలను సమర్పించాలని తెలిపారు. ప్రతి బూత్ స్థాయి అధికారి తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదై ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం చట్టరీత్యా శిక్షార్హమని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పేర్లు, ఇంటిపేర్లు, మహిళల వివాహానంతర ఇంటిపేరు మార్పులు వంటి వ్యత్యాసాలను పరిశీలించి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ బూత్ స్థాయి అధికారుల జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంచాలని, రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లతో తరచూ సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రతి శనివారం జిల్లా స్థాయిలో, ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు బి.ఎల్.ఓ. యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని, ఎం.ఎస్.ఎస్. వాలంటీర్లు, ఎన్.సి.సి. క్యాడెట్లు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని వినియోగించుకోవాలని, గిరిజన, సరిహద్దు ప్రాంతాలలో స్థానిక భాష తెలిసిన హెల్పింగ్ హ్యాండ్స్‌ను నియమించాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించిన అనంతరం ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పూర్తి అయిన స్టిక్కర్‌ను ప్రతి ఇంటికి అతికించాలని, ఫారాల పూరణ, సమర్పణపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

 

A special comprehensive revision process must be undertaken in accordance with the prescribed action plan.

 

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 72శాతం ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ పూర్తయ్యిందని అన్నారు. జిల్లాలో మొత్తం 14,39,734 మంది ఓటర్లకు గాను 10,33,033 మంది ఓటర్లకు ఫారంల పంపిణీ జరిగిందని, మరో రెండు మూడు రోజులలో మిగతా 4,06,701 మంది ఓటర్లకు కూడా ఫారాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్బన్ ఏరియాలోనూ ఎస్ఐఆర్ అమలును వేగవంతం చేస్తామన్నారు. బీఎల్ఓ లు ఇంటింటికి తిరిగి ఫారంలు అందజేస్తున్నారని, ఈ.ఆర్.ఓ లు, ఏఈఆర్ఓ లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతున్నారని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బీఎల్ఏలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

 

A special comprehensive revision process must be undertaken in accordance with the prescribed action plan.