Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:04 pm Posted by : ramakrishna

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం

 

. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

జక్రాన్‌పల్లి, బతుకమ్మ :

 

ప్రజల భద్రత కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానమని నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. మన ఊరు – మన భద్రత – మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా జక్రాన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను సీపీ మంగళవారం సాయంత్రం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా సులభంగా గుర్తించి, అవసరమైన సందర్భాల్లో తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ వివరించారు. ట్రాఫిక్ నియంత్రణలో కూడా సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన సూచించారు.

 

A single CCTV camera is equivalent to 100 police personnel.

 

ముఖ్యంగా దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ భద్రతను బాధ్యతగా తీసుకుని సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కమిషనర్ సూచించారు. జక్రాన్‌పల్లి గ్రామంలో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖకు సహకరించిన గ్రామ పంచాయతీని ఆయన అభినందించారు. అలాగే గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, సీసీఆర్‌బీ ఏసీపీ గురు నాయుడు, డిచ్‌పల్లి సీఐ తిరుపతి, జక్రాన్‌పల్లి ఎస్‌ఐ మహేష్, గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం, మండల అధ్యక్షుడు రెక్కల సురేష్‌తో పాటు గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

A single CCTV camera is equivalent to 100 police personnel.