. . . మంజీరా నదిలో ముగ్గురు గల్లంతు
. . . వారిని కాపాడేందుకు వెళ్లిన బాలుడు పరిస్థితి విషమం
పిట్లం, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మంజీరా నదిలోముగ్గురు గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు వెళ్లిన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం పిట్లం మండలం బోల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం మంజీరా నది ఓడ్డున గంగమ్మ పండగ నిర్వహించింది. దానికి లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన అనిత (40) తన కూతురు శివాని(13) తో పాటు హాజరైంది. వారికి తోడుగా కిష్టపూర్ చెందిన బంధువుల పిల్లలు పావని శ్రీ( 15), భానుప్రసాద్ లు కూడా వచ్చారు. పండగ అనంతరం మంజీరా నదిలో వంట సామాగ్రి కడిగేందుకు దిగి శివాని, పావనీ శ్రీ నీట మునిగారు. వారిని కాపాడేందుకు అనిత ప్రయత్నించి నదిలో మునిగింది. వారితో పాటు ఉన్న భాను ప్రసాద్ అక్రమంలోనే నీట మునిగాడు. స్థానికులు బాను ప్రసాద్ ను కాపాడి ఆసుపత్రికి తరలించారు.

బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. గంగమ్మ పండగ చేసుకుని మొక్కులు తీర్చుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే ముగ్గురు నదిలో మునిగి మృతి చెందడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. బాన్సువాడ జిల్లా ఆసుపత్రి వద్ద బంధువులు కుటుంబ సభ్యుల రోధనలతో దద్దరిల్లింది.ఘటన స్థలాన్ని పిట్లం పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు.
