Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 2:08 pm Posted by : ramakrishna

కామ్రేడ్ అనసూయక్కకు ప్రజాపంథా విప్లవ నివాళి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ నాయకురాలు కామ్రేడ్ అనసూయక్క 2వ వర్ధంతి సందర్భంగా పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలో  ఎన్.ఆర్ భవన్ లో మంగళవారంకామ్రేడ్ అనసూయక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ అనసూయక్క సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్నాటి యాదగిరి జీవిత సహచరిగా, పార్టీ కార్యకర్తగా నిబద్ధతతో జీవించారన్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే కామ్రేడ్ యాదగిరి పార్టీకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసినా, అనసూయక్క ఎదురు చెప్పలేదన్నారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో కామ్రేడ్ యాదగిరన్న రహస్య జీవితంలోకి వెళ్ళారని, అటు పోలీసు నిర్బంధాన్ని ఇటు ఆర్థిక కష్టాలను ఓర్చుకొని, కుటుంబాన్ని పోషించిందన్నారు.ఇద్దరు కూతుళ్లు, కొడుకు కులాంతర, ఆదర్శ వివాహాలను అనసూయక్క సంపూర్ణంగా స్వాగతించారన్నారు. ఎప్పుడూ ఆడంబరాలకు పోలేదన్నారు. పార్టీ ఇచ్చిన అలవెన్స్ లతోనే సర్దుకుంటూ, అతి సాధారణ జీవితం గడిపారన్నారు. జీవితాంతం పార్టీనీ కుటుంబంగా భావించి, పార్టీ పద్ధతిలోనే జీవించారని కొనియాడన్నారు. చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను లయన్స్ క్లబ్ కు, వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తన శరీరాన్ని దానం చేసి ఆదర్శమయ్యా రన్నారు. కామ్రేడ్ యాదగిరన్న జీవిత సహచరిగా, పార్టీ సభ్యురాలిగాకామ్రేడ్ అనసూయక్క జీవితం పార్టీ కుటుంబాల్లోని మహిళలకు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్,  జిల్లా నాయకులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్ ప్రజా సంఘాల నాయకులు ఏ.రవీందర్, వి.గోదావరి, కే.సంధ్యారాణి, కే.భాస్కరస్వామి, రాధ, మేఘన, వర్ష, కే.గణేష్, డి.నవీన్, ఎం.సాయిబాబా, సాయరెడ్డి, సునంద, నర్సక్క, నితిన్, లలిత తదితరులు పాల్గొన్నారు.