– మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన కోర్వ మోహన్(46) సౌదీ అరేబియాలోని తైఫ్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మోహన్ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడుని ఆర్మూర్ లో కలిసిన విన్నవించారు. తైఫ్ బల్దియా లో పని చేస్తున్న మోహన్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తమకు సమాచారం అందించారన్నారు. కోటపాటి వెంటనే స్పందించి రియాద్ లోని ఇండియన్ ఎంబసి, సౌదీలోని ప్రవాసులకు సేవ చేస్తున్న ఫరూక్ అనే వ్యక్తితో మాట్లాడి వివరాలు తెలిపారు. సత్వర చర్యల కోసం ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మెయిల్ ద్వారా సమచారాం అందించారు. మోహన్ తైఫ్ హుకుమత్ బల్దియాలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు అయ్యే ఖర్చు, నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని కోటపాటి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కోటపాటి వెంట రుక్మాజి, బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు.