Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 January 2025, 2:02 pm Posted by : ramakrishna

జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి

. ప్రజాపాలనతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ

. కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం

. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు

. ఇచ్చిన మాట ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాము కోరుతున్నామని, ప్రభుత్వం సైతం అదే ఆలోచనలో ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.  క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు అవినీతి పాలనను వద్దనుకొని కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం బడ్జెట్ లో రూ.20వేల కోట్లు కేటాయించిందని, ఇళ్లు లేని వారందరికీ ఇళ్లిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈనెల 26వ తేదీ నుంచి అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

రైతుబంధు పేరుతో రూ.21వేల కోట్ల దుర్వినియోగం

బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయేతర భూములకు రైతుబంధు ఇవ్వడంతో రూ.21వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని భూపతిరెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పంటలు పండే ఎన్ని ఎకరాలకైనా రైతుభరోసా ఎకరానికి రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. రైతు భరోసా రూ.15వేలకు బదులు రూ.12వేలు ఇవ్వడానికి కారణంగా కేసీఆర్ చేసిన అప్పులే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీలకు లేదన్నారు. కౌలు రైతులకు సైతం ప్రయోజనం కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పును మోపి వెళ్లిపోయినా తమ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తోందన్నారు.

బీసీలకు చేసింది శూన్యం

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ బీసీలకు చేసింది శూన్యమని, బీసీ రిజర్వేషన్లను 27శాతానికి పరిమితం చేశారన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. కవిత బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. లిక్కర్ స్కాంలో ఉన్న కవిత సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు.

కేసీఆర్ కుటుంబం జైలుకెళ్తుంది

కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని, ఆయన కుటుంబ జైలుకెళ్లడం ఖాయమని భూపతిరెడ్డి అన్నారు. ప్రజల కోసం జైలుకెళ్తానని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని తెలియడంతో స్టే తెచ్చుకున్నారని విమర్శించారు.

భారతీయ జూటా పార్టీ అది..

బీజేపీ భారతీయ జూటా పార్టీ అని, పసుపు బోర్డు హామీ ఇప్పటికీ అతీగతీ లేదని విమర్శించారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, నల్ల చట్టాలను తీసుకొచ్చి ఆరు వేల మందిని పొట్టనపెట్టుకుందన్నారు. రైతు భరోసా వంటి పథకాన్ని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

విలేకరుల సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు అగ్గు భోజన్న, ఎల్లయ్య, ఆదె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

A minister post should be given to the district