Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 7:28 pm Posted by : ramakrishna

రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికి బాగు పడదు

 

. . . రేవంత్ రెడ్డి ది తుగ్లక్ పాలన

 

. . . యూరియా యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

 

. . . బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

బాల్కొండ, బతుకమ్మ :

 

రాష్ట్రంలో రైతులు ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బాల్కొండ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ – 63 వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద గురువారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు కడుపు మంటతో, ఆవేదనతో రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితిని ఈ రాక్షస ప్రభుత్వం, దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారని ధ్వజమెత్తారు. “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం” ఎన్నటికీ ముందడుగు వేయలేదని, రైతులు లేకపోతే రాజ్యమే లేదని మన పెద్దలు చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు ప్రతి చిన్న అవసరానికి, హక్కుల కోసం రోడ్లెక్కి కొట్లాడాల్సి వస్తోందని, అలాంటి దారుణమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

A kingdom where the farmer weeps will never prosper.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) రైతులను కంటికి రెప్పలా, గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని ఆయన కొనియాడారు. దశాబ్దాలుగా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను దూరం చేస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందించిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, వరద కాల్వల ద్వారా గోదావరి జలాలను పోచంపాడుకు తరలించి, అక్కడి నుండి కప్పలవాగు, పెద్దవాగులను నింపిన విధానాన్ని గుర్తుచేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా చెక్ డ్యామ్‌లను నిర్మించి, భూగర్భ జలాలను పెంచి రైతాంగానికి సాగునీటి ఢోకా లేకుండా చేశామని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా పంపిణీలో డిజిటల్ యాప్‌ల పేరుతో కొత్త నిబంధనలు తీసుకువచ్చి రైతులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన యూరియాను ఎకరానికి 4 సంచుల చొప్పున ఒకేసారి సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ పాలన వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంక్సాపూర్ గ్రామంలో ప్రారంభమైన ఈ నిరసన జ్వాలలు మోర్తాడ్, తిమ్మాపూర్, ధర్మోరా, వేల్పూర్, డొంకల్, మెండోరా, కమ్మర్‌పల్లి, బడా భీమ్‌గల్ వంటి అనేక గ్రామాలకు విస్తరించాయని, బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనూ, రైతులు స్వతంత్రంగానూ రాస్తారోకోలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖాధికారులు ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చేస్తున్న ప్రకటనలలో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారమే జిల్లాలో మొత్తం 3 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే 4 లక్షల యూరియా సంచులను పంపిణీ చేశారని, అంటే ఒక్కో రైతుకు రెండు సంచులు కూడా సరిగా అందలేదని ఎద్దేవా చేశారు. మిగిలిన 1.5 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు ఒక్క సంచి కూడా అందలేదని ఆరోపించారు. జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ఎకరానికి కనీసం 4 సంచుల చొప్పున లెక్కించినా ఒకే పంట కాలానికి 24 లక్షల సంచుల యూరియా అవసరమవుతుందని గుర్తుచేశారు.

 

A kingdom where the farmer weeps will never prosper.

 

ఇప్పటివరకు 4 లక్షల సంచులు మాత్రమే ఇచ్చి, ఇంకా 20 లక్షల సంచుల కొరత ఉండగా స్టాక్ ఫుల్ ఉందని ప్రకటించడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొసైటీలు డిఫాల్ట్ అయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు సాకులు వెతుకుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ వేధింపుల చర్యల్లో భాగంగా ఇప్పటికే సొసైటీ చైర్మన్లపై మూడు సార్లు ప్రత్యేక ఆడిట్ నిర్వహించినప్పటికీ ఎలాంటి అవకతవకలు తేలలేదని, 2014కు పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ బకాయిలు ఉన్నట్లు ఆడిట్‌లో స్పష్టమైందని గుర్తు చేశారు. ఒకవేళ సొసైటీలపై ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని, కానీ దానిని సాకుగా చూపి రైతులకు ఎరువులు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. డిఫాల్ట్ కానీ సొసైటీ ల్లో, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులలో కూడా ఎందుకు యూరియా దొరకడం లేదని ఆయన ప్రశ్నించారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బాల్కొండ రైతాంగం అంత అమాయకులు కారని హితవు పలికారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరువుల కొరత రాకుండా అన్‌సీజన్‌లోనే ముందస్తుగా నిల్వలను తెప్పించి సొసైటీలు, దుకాణాలలో సిద్ధంగా ఉంచేవారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం కోటాలు తగ్గించిన సమయంలో, తాము స్వయంగా ఢిల్లీకి వెళ్లి అప్పటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించి, రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం, ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల వివరాలను వివరించి ఒప్పించి అదనపు కోటాలు సాధించుకున్నామని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి గానీ రైతుల పట్ల ఆ కనీస బాధ్యత లేదని విమర్శించారు. గతంలో రూ. 1200 గా ఉన్న 20:20 (బీస్ బీస్) ఎరువుల బస్తా ధరను నేడు ఏకంగా రూ. 2150 కి, జీలుగు 1450 నుండి ఏకంగా 2450 కి పెంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించకపోతే సమాజం ఏం తింటుందని ప్రశ్నించారు. రైతులను రోడ్ల మీద కూర్చోబెట్టడమే ఈ ప్రభుత్వాల సాధన అయితే, రాబోయే రోజుల్లో అన్నదాతలు పాలకులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి రూ.10,000 చొప్పున రైతు బంధు అందించి, రూ.75,000 కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారని,అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చినా, ఐదు సీజన్లు గడిచినా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. అలాగే రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదని, బాల్కొండ నియోజకవర్గంలో అనేక మంది రైతులు ఇంకా లబ్ధి పొందలేదని పేర్కొన్నారు. యూరియా సరఫరా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగా నిల్వలు ఏర్పాటు చేసి రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ విధానం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత రైతులకు స్మార్ట్‌ ఫోన్లు, యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడంతో యూరియా పొందడం కష్టమవుతోందన్నారు. ఒకేసారి అవసరమైన ఎరువులు ఇవ్వకుండా పరిమితంగా పంపిణీ చేయడం వల్ల రైతులు పలుమార్లు తిరగాల్సి వస్తోందని విమర్శించారు.

 

A kingdom where the farmer weeps will never prosper.