Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 1:19 pm Posted by : ramakrishna

విషాదాన్నినింపిన ప్రయాణం

కర్నూల్, బతుకమ్మ : కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన ఘోర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు  కర్నూల్ శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై 44 పై బైక్ ను ఢీకొంది.   బైక్ బస్సు కిందకి చొచ్చుకు పోయింది. దీంతో బైక్ లోని పెట్రోల్ లీక్ కావడంతో  బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది సజీవ దహనం కాగా, 21  మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. డ్రైవర్లలో ఒకరు పరారవగా.. మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు. గాయపడిన కర్నూల్ సర్వజన ఆస్పత్రికి తరలించారు. బస్సు పూర్తి దగ్ధమైంది. ఈప్రమాదంలో ద్వి చక్ర వాహనదారుడు చనిపోయాడు. అతడిని కర్నూల్ మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గా నిర్ధారించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటంబానికి చెందిన గొల్ల రమేశ్ సహా నలుగురు ఈప్రమాదంలో మరణించారు.  గొల్ల రమేశ్ (35), అనుష (30), మన్విత (10),  మనీశ్ (12) మరణించారు.

ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ..

ఈప్రమాదంలో ఏపీలోని బాపట్ల యద్ధనపూడి మండలం పూసపాడు కు చెందిన గన్నమనేని ధాత్రి(27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్త కొండూర్ కు చెందిన అనుష రెడ్డి దుర్మరణం చెందారు. వీరు బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు గా పని చేస్తున్నారు.

తల్లి, కొడుకులు..

బెంగళూరుకు చెందిన తల్లి కుమారుడు పిలోమి నాన్ బేబీ (64), కిషోర్ కుమార్ (41), దీపావళి పండుగకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని కషి డిఫెన్స్ కాలనీలోని బంధువు రాము ఇంటికి వచ్చారు.  గురువారం సాయంత్రం కావేరి ట్రావెల్ బస్సు ఎక్కి బెంగళూరు బయలు దేరారు. వీరి ఆచూకీ తెలియడం లేదు.

విచారణకు ఆదేశించిన చంద్రబాబు

కర్నూల్ బస్సు ప్రమాద ఘటన నేపధ్యంలో ఇతర రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పరిహారం ప్రకటించిన తెలంగాణ  ప్రభుత్వం

ఈబస్సు ప్రమాద ఘటనలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు

ఈబస్సు ప్రమాద ఘటనపై సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 A journey filled with tragedy