- యథేచ్ఛగా లక్ష్మి ప్రధాన కాలువ స్థలం ఆక్రమణ
- ఫంక్షన్ హాలు కోసం ఫెన్సింగ్ ఏర్పాటు
- తొలగించాలని అధికారులు ఆదేశించినా పట్టించుకోని వైనం
- జేఈకి బెదిరింపులు . . . చేష్టలుడిగి చూస్తున్న అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మి కాలువ స్థలాన్ని కబ్జా చేసి యథేచ్ఛగా ఫెన్సింగ్ వేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. ముప్కాల్ గ్రామ పరిధిలో ఫంక్షన్ హాలు నిర్మించిన ‘కొమ్ములు’ తిరిగిన కబ్జాదారు సర్వే నంబర్ 70/1, 70/3 లోని లక్ష్మికాలువ స్థలాన్ని (నేషనల్ హైవే 44 బ్రిడ్జికి సమీపంలో) ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. ఫంక్షన్ హాలుకు దీనినే రోడ్డు చూపగా రాకపోకలు సాగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు గతంలో ఫిర్యాదు వెళ్లగా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ స్థాయి అధికారి సంబంధిత నోటీసులు జారీ చేశారు. లక్ష్మి మెయిన్ కెనాల్ స్థలంలో వేసిన పెన్షింగ్ ను 12 రోజుల్లో తొలగించాలని గతేడాది జూన్ లో ఆదేశించారు. సుమారు ఎనిమిది నెలలవుతున్నా ఫంక్షన్ హాలు యజమాని మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ కి ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ లో కొనసాగిన మాజీ ప్రతినిధి ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జీ అనుచరుడిగా కొనసాగుతున్న సదరు వ్యక్తి ఫంక్షన్ హాలు నిర్మించి లక్ష్మీ ప్రధాన కాలువ స్థలాన్ని కబ్జా చేశాడు. కబ్జా స్థలానికి ఫెన్షింగ్ వేసి అందులోని పంక్చర్ షాపునకు అద్దెకు ఇచ్చాడు. షాపు నుంచి ప్రతినెలా అద్దె వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై జేఈ పలుమార్లు ప్రశ్నించేందుకు వెళ్లగా బెదిరిస్తూ వెనక్కి పంపించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది.

- కబ్జా స్థలాన్ని రోడ్డుగా చూపి
ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిబంధనలకు నీళ్లొదిలారని ఆరోపణలున్నాయి. స్థానికంగా పెట్రోల్ బంక్ ఉన్నప్పటికీ డీటీసీపీ అప్రూవల్ కు దరఖాస్తులో దానిని నమోదు చేయకపోవడం విశేషం. స్థానికంగా అక్కడ చేసిన లేఅవుట్ ప్లాట్ లలో పది శాతం భూమిని పంచాయితీకి మార్ట్ గేజ్ చేయకపోయినా అనుమతులు ఇచ్చారనేది బహిరంగ వాస్తవం. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షల పైచిలుకు ఫీజు వసూల్ చేయాల్సి ఉండగా కేవలం లక్షా 40 వేలతో అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వచ్చాయి. ఏకంగా ఆనాటి ముప్కాల్ పంచాయితీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కేవలం ప్రజాప్రతినిధి అన్న ఒక్క కారణంతోనే బహిరంగ కబ్జాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఫంక్షన్ హాలు నిర్మాణం చేపట్టిన మాజీ ప్రజాప్రతినిధి ఫైర్ సేఫ్టీ కి సంబంధించి ఎన్ వోసీ లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. లక్ష్మి కాలువ భూమినే రోడ్డుగా చూపించడం గమనార్హం. 40 ఫీట్ల రోడ్డు నిబంధనను పట్టించుకోకుండా ఫంక్షన్ హాలును నలుదిక్కులా ప్యాక్ చేసినా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.
- సీఈ ఆదేశించినా
లక్ష్మి ప్రధాన కాలువ స్థలాన్ని కబ్జాను తొలగించాలని సీఈ ఆదేశించినా అతీగతీలేదు. ఫంక్షన్ హాలు అధికార పార్టీలో కొనసాగుతున్న మాజీ ప్రతినిధిది కావడమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల క్రితం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామంతో పాటు మండలంలో కొత్త చర్చకు దారితీసింది. అధికార పార్టీలో ఉండి తన అక్రమాలను కొమ్ముకాస్తున్నారని వాదనలున్నాయి. ఉన్నతాధికారులను కలిసి ఈ విషయంపై ఆరా తీస్తే తమకు పైస్థాయిలో ఒత్తిళ్ళున్నాయని అందుకే దర్జాగా లక్ష్మీకాలువను కబ్జా చేసి వ్యాపార లావాదేవిలు నిర్వహిస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
