. . . మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ నగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్ లైన్‌ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్‌ను మంత్రి ప్రారంభించి, ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాల్ చేసి అధికారిక సమాచారం తెలుసుకోవాలని సూచించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నందున, దరఖాస్తుదారులు తమ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారు హైదరాబాద్ క్యూర్ పరిధిలో కనీసం పదేళ్లుగా నివసించి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అలాగే దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యుల పేరుపై ఓఆర్ఆర్ పరిధిలో లేదా క్యూర్ ప్రాంతంలో సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తును మాత్రమే స్వీకరించి, ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఒక్కటే సరిపోతుందని, కులం, ఆదాయం లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. లాటరీ ప్రక్రియ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసేటప్పుడు రూ.10 వేల ఈఎండీని యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని, నగదు లేదా ఇతర చెల్లింపు విధానాలు ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ ఫ్లాట్ కేటాయింపు జరగకపోతే అదే బ్యాంకు ఖాతాకు మొత్తం తిరిగి జమ చేస్తామని తెలిపారు. దరఖాస్తు సంఖ్య, మీ సేవ రశీదు, చెల్లింపు రశీదు, నమోదిత మొబైల్ నంబర్‌ను ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించి, క్షేత్రస్థాయి ధ్రువీకరణ అనంతరం అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. నిర్మిస్తున్న ఫ్లాట్ల కంటే అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువైతే పారదర్శకంగా లాటరీ నిర్వహించి కేటాయింపులు చేపడతామని వెల్లడించారు. ఈ పథకం కింద నిర్మించే ఫ్లాట్లు సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20 నుంచి 25 గజాల అన్‌డివైడెడ్ షేర్ స్థలాన్ని లబ్ధిదారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.పి. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
