. . . హెడ్ కానిస్టేబుల్ తో పాటు మహిళ అరెస్టు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పోలీస్ స్టేషన్ లలో నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో రైల్వే హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో మహిళను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ కు చెందిన గొట్టే స్వరూప, రైల్వే పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కుబేరుడు ఇద్దరు కలిసి నగరంలోని 3వ టౌన్ పరిధిలో ముగ్గురు వద్ద నుంచి రూ.4 లక్షలు, నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి వద్ద, రూరల్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఒకరి వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు రూపాయలు వసూల్ చేశారని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం ఆరు కేసులలో ఇరువురిపై కేసులు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.
స్వరూప ఆర్ అండ్ బి ఆఫీసర్ అని పేరు చెప్పుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్ అండ్ బిలో కాంట్రాక్ట్ లు ఇప్పిస్తామని, జిల్లా పరిషత్, రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను బుట్టలో వేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు గుర్తించారు. డబ్బులను అడిగితే కుబేరుడు తాను పోలీసునని వారిని బెదిరింపులకు గురి చేసేవాడు. గత కొన్ని రోజులుగా డబ్బులు రిటర్న్ ఇవ్వాలని నిరుద్యోగులు కోరినా పట్టించుకోకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరిని అరెస్టు చేసి కటకటల వెనక్కి పంపారు.
స్వరూపకు ఆది నుంచి నేరచరిత్ర ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 2019లో ఒకసారి, 2024లో మరోసారి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, వ్యక్తులకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో అక్కడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు రికార్డులు ఉన్నాయి. నిజామాబాద్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్ కు వెళ్లిన సమయంలో స్వరూప, కుబేరుడికి ఏర్పడిన పరిచయం కలిసి నిరుద్యోగులను ముంచే వరకు పెరిగింది. ఆ పరిచయంతోనే స్థానికంగా కుబేరుడే స్వరూపను ప్రభుత్వాధికారిని అని పరిచయం చేసేవాడినని దాంతో నిరుద్యోగులు పోలీసులు స్వయంగా చెబుతున్నాడని నమ్మి లక్షల రూపాయలు వారి చేతులో పెట్టి నిండా మునిగారు.