. . . జులై 2 న ఉప్పల్ భగాయల్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తాం
. . . ఆగస్ట్ 6 లోగా ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి
. . . తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
జులై 2 న ఉప్పల్ భగాయల్ లో మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం చేస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత జాతీయ జెండా ఎగురవేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ భూపోరాటంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, పత్రిక మిత్రులు సహా ఊరికి ఒక్కరైనా సద్ది కట్టుకోని రావాలన్నారు. మరొక మిలియన్ మార్చ్ ను గుర్తు చేసే విధంగా ఈ ఉద్యమాన్ని చేద్దామన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవటం దుర్మార్గమన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని మది నిండా, ఆర్తితో గుర్తు చేసుకుంటున్నామని, కచ్చితంగా వారందరీ రుణం తీర్చుకుంటామని మాట ఇస్తున్నానన్నారు. ఆస్తులు, ఉద్యోగాలు పొగొట్టుకోని మరో స్వాతంత్ర పోరాటం మాదిరిగా తెలంగాణ ఉద్యమం చేసిన వారందరికీ సెల్యూట్. తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ల తర్వాత కూడా మనం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకపోవటం అన్యాయమని, తెలంగాణ జాగృతి తరఫున నాలుగు జిల్లాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకున్నామన్నారు. కానీ హైదరాబాద్ లో ఆయన విగ్రహాం ఉండాల్సిన అవసరముంది. జయశంకర్ సార్ విగ్రహాం కోసం 2014 నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నామని, 2017 లో అప్పటి మున్సిపల్ శాఖకు కూడా లేఖ రాశామనీ కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి సైద్దాంతిక పునాదులు వేసిన జయశంకర్ సార్ విగ్రహాం రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిందేనన్నారు. ఆగస్ట్ 6 న జయశంకర్ సార్ జయంతి ఉంది. ఆ లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖకు మేము ఇచ్చిన లేఖను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తెలంగాణ ఉద్యమం అనేది మరో స్వాతంత్ర పోరాటం మాదిరిగా జరిగిందని, ఇప్పుడున్న పిల్లలకు ఈ ఉద్యమం గురించి పూర్తిగా తెలియదన్నారు. కానీ వారంతా మన చరిత్రను తెలుసుకోవాలి. ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారని, జూన్ 2 అంటే ఒక హాలిడే కాదు. మీకు వివక్ష లేకుండా, మీ యాస ను మీరు మాట్లాడుకునేలా చేసిన రోజు అన్నారు. మీరు సెకండ్ గ్రేడ్ పౌరులు కాదని, ఎంతో స్వేచ్ఛగా ఉండే అవకాశం వచ్చిన రోజన్నారు.అందుకే మన చరిత్రను కచ్చితంగా ఇప్పటి పిల్లలంతా కూడా తెలుసుకోవాలని, ఆగస్ట్ 15 న ఎంతో గొప్పగా వేడుకలు జరుపుకుంటామో…జూన్ 2 ను కూడా అంతే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. జూన్ 2 వేడుకల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తాడని భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులను అమరవీరులను ఆదుకోని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని, తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తామన్నారు. ఉద్యమకారులను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు.
