. . . పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్, మహేష్ కుమార్ గౌడ్, కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పురాతన ఖిల్లా రఘునాథ ఆలయంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్ర్తోత్తంగా సీతా రాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖిల్లా రామాలయ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాజకీయాలు పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని కోరారు. ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర పథకాలు అందేలా చూస్తానని, ఆలయ అభివృద్ధి కోసం తాను సంకల్పంతో ఉన్నానని, కేంద్ర సహకారం తీసుకొని 10 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా ప్రసాద్ స్కీమ్ తో దేశంలోని అనేక ఆలయాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు.

రామాలయానికి రోప్ వే తెచ్చేందుకు కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రామాయణంతో కుటుంబ విలువలు, గౌరవం, భక్తి ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు. శ్రీ రాముడు ధర్మానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఇప్పటికే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయడం ఎంతో సంతోషించాల్సిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ విశ్వ హిందు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.