- చేతులతో కొడితే కారు అద్దాలు పగిలాయి
- కిందపడితే తలలు పగిలాయి
- చేతితో కొడితే వీపుపై సొట్టలు పడ్డాయి
- పరస్పర దాడులని కేసుల నమోదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ముగ్గురు వ్యక్తులు ఒక పది మందితో గొడవ పడితే అదేదో అకస్మాత్తుగా, అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పవచ్చు. అదే ముగ్గురు 40 మందితో గొడవ పడితే అది పథకం ప్రకారమే జరగిందని ఎవరినైనా అడిగినా ఇట్టే చెప్పేస్తారు. చేతులతో కొడితే కారు అద్దాలు బద్దలవుతాయి, కింద పడితే తలలు పగిలి రక్తం కారుతుంది, చేతులతో కొడితే వీపులో సొట్టలు పడుతాయి ఇది ఎవరు ఔనన్నా కాదన్నా పోలీసులు మాత్రం ఇదే చెబుతారు. ఎందుకంటే ఈ నెల 4న మోపాల్ మండలం సిర్పూర్ తాండ వద్ద భూ వివాదంలో జరిగిన దాడి కేసును పోలీసులు పరస్పర దాడులు కేసుగా నమోదు చేయడమే అందుకు నిదర్శనం. పుష్కర కాలం క్రితం కొనుగోలు చేసిన భూమిని వ్యక్తికి అమ్ముకున్న 70 ఏళ్ళ వయస్సున్న వ్యక్తి మరో ఇద్దరితో కలిసి 40 మందితో గొడవపడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విశేషం. ఈ దాడిలో పరస్పరం దాడి చేసుకుంటే అవుతలి వ్యక్తులకు చిన్న గీత పడకున్నా పరస్పర దాడిగానే నమోదయింది. అదే వ్యక్తులు వృద్దుడు అని చూడకుండా దాడి చేసి కొడితే అతని తల పగిలి బట్టలు చీలికలు, పేలుకలు కాగా అతని డ్రైవర్ కు వీపులో దాడి చేసినందుకు సొట్టలు(వాతలు) పడితే దానిని చేతితో జరిగిన దాడిగా నమోదు చేయడం విశేషం. పోలీసులు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు వారు తలుచుకుంటే దెబ్బలు కూడా ఉత్తుత్తి దెబ్బలుగానే నమోదు కావడమే కాకుండా ఏకంగా సెక్షన్ లకు మార్చి దాడి చేసిన వారిని రప్పించే విధంగా చేయవచ్చని బుధవారం నాడు మోపాల్ పోలీ స్ స్టేషన్ పరిధిలో జరిగిన పరస్పర దాడి కేసును ఉదహరించవచ్చు. గతంలోనూ సదరు వృద్దుడు తన వ్యవసాయ క్షేత్రంలో కబ్జా జరుగుతుందని ఫిర్యాదు చేసి 90 రోజులు గడిచిన ఉలుకుపలుకు లేని పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సెటిల్ చేసుకోమని ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చిన వ్యవహరాలున్నాయి. ఒట్టిగా భూమి కోసం ప్రాణాలు పొగొట్టుకుంటారా అని సెటిల్ చేసుకోవాలని బెదిరింపులకు దిగినట్లుగానే దాడి జరుగడం గమనార్హం. ఈ విషయంలో ఈ నెల 4న ఎఫ్ఐఆర్ నమోదయినప్పటికీ 5న సెటిల్ చేసుకోవాలని పిలువడం వారికే చెల్లింది. సంబంధిత భూమిపైకి వెళ్తే దాడి జరుగుతుందని ముందస్తు జోస్యం చెప్పినట్లుగానే భూ యజమానిపై దాడి జరుగడం, కేసులు నమోదు అంతా ఏదో తూతూ మంత్రంగా చేసినట్లుగానే ఉందని బాధితులు వాపోయారు. ఇదే విషయంపై మోపాల్ ఎస్సై యాదగిరి గౌడ్ ను వివరణ కోరగా అక్కడ పరస్పర దాడులు జరిగాయని అందుకే ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
