నెలరోజులుగా మార్కెట్ లో సోయా నిలువ
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఘటన
మద్నూర్, బతుకమ్మ: సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని ఓ రైతు చెట్టు ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.ఈఘటన మద్నూర్ మార్కెట్ యార్డులో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల రోజులుగా ఆన్లైన్ నిలిపివేయడంతో 25 వేల క్వింటాళ్ల సోయా మార్కెట్ యార్డులో నిలువ ఉంది. రైతులు ధర్నా చేసి, అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకెళ్లడంతో వ్యవసాయ మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో సోయా కొనుగోలు పున ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. దీంతో విసుగు చెందిన డోంగ్లి మండల కేంద్రంలోని లింబూర్ గ్రామానికి చెందిన రైతు భూమయ్య మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని చెట్టు పైకి ఎక్కి టవల్ తో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. స్థానిక రైతులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి, రైతుని సముదాయించి కిందికి దింపారు.