Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 10:22 pm Posted by : ramakrishna

పోలీస్ శాఖలో అవినీతి తిమింగలం

 

. . . ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డి ఇండ్లలో సోదాలు

 

. . . వందల కోట్ల విలువైన భూముల తాలుకూ పత్రాలు స్వాధీనం

 

. . . రెండు కిలోల బంగారు నగలు, 20 కిలోల వెండి స్వాధీనం

 

. . . బినామీల పేర్ల మీద కోట్ల కొద్ది ఆస్తులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఇటీవల కాలంలో జలమండలి జనరల్ మేనేజర్ జీఎం కుమార్, ల్యాండ్ అండ్ సర్వే  డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరక్టర్ నరహరి రావు, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ లు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు అధికారుల ఆస్తులు లెక్క బెట్టిన ఏసిబీ మనిషికి రెండు వందల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించారని గత నెలలో జరిపిన దాడుల్లో బట్ట బయలు చేసిన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్ లోని పోలీస్ శాఖ కంప్యూటర్ విభాగంలో డీఎస్పీ గా పని చేస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాందించాడని ఆరోపణల నేపథ్యంలో ఏసిబి దాడులు నిర్వహించింది. డీఎస్పీ భీమ్ రెడ్డికి చెందిన నివాసాలు, బంధువులు, సన్నిహితులు, అనుమానిత బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ లోని నార్సింగి సమీపంలోని వెసెల్లా మెడోస్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు రాష్ట్రంలోని సుమారు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో వివిధ హోదాల్లో, అలాగే పటాన్‌చెరు డీఎస్పీగా పనిచేసిన సమయంలో భీమ్ రెడ్డి అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఒక డీఎస్పీ స్థాయి అధికారి వందల కోట్ల ఆస్తులను పోగెయడంతో పోలీస్ శాఖలో ఎంత మంది తిమింగలాలు ఉన్నారని చర్చ జరుగుతుంది.

. . . భీమ్ రెడ్డి ఆస్తుల చిట్టా ఇదే

సోదాల్లో ఇప్పటివరకు 20 కి పైగా స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, కమర్షియల్ స్థలాలు, ఫ్లాట్లు, పెట్టుబడులు గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని వెసెల్లా మెడోస్‌లో విల్లా, టెలికం నగర్‌లో జి+2 భవనం, సాయి ప్రభ రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, సీయోన్ అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లాట్ క్రాంతి, మణికొండలో ల్యాంకో హిల్స్ లో 500 గజాల కమర్షియల్ కాంప్లెక్స్‌ లో వాటాలున్నట్టు గుర్తించారు. మణికొండలోని మర్రి చెట్టు జంక్షన్ వద్ద 3000 గజాల వాణిజ్య ఆదాయం కలిగిన స్థలాన్ని గుర్తించారు. తెల్లాపూర్‌లో అభినందన రెసిడెన్సియల్ లో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ లో 500 గజాల ఓపెన్ ప్లాట్, కర్ణాటక లో ఆరు ఎకరాల వ్యవసాయ భూమికి సంబందించిన రికార్డులు గుర్తించారు. అదే కర్ణాటక లో 38 ఎకరాల వ్యవసాయ భూమి భీమ్ రెడ్డి పై ఉంది. కర్ణాటక రాజధాని బెంగుళూరు లోని దేవన హల్లి లో ఒక ఎకరం భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్ లోని కామినేని హాస్పిటల్ దగ్గర 200 గజాల ఓపెన్ ఫ్లాట్, జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వద్ద 400 గజాల ఓపేన్ ఫ్లాట్, పటాన్ చెరువులొ 200 గజాల భూమిని, వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ లో 1000 గజాల భూమి, అదే ప్రాంతంలో 2 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. శ్రీ రాఘవేంద్ర రాక్స్ అండ్ మినరల్స్ లో రూ. 75 లక్షల పెట్టుబడులను గుర్తించారు. ముచ్చింతల్ గ్రామంలో సీసీ కుంట వద్ద 4.20 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. సంకి రెడ్డి భీమ్ రెడ్డి ఇళ్లలో బంధువుల సన్నిహితుల సోదాల సందర్భంగా నివాసంలో సుమారు రూ.3.60 లక్షల నగదు, బినామీ వ్యక్తి ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, దాదాపు రూ.19.91 లక్షల బ్యాంక్ డిపాజిట్లు గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు బయటపడిన ఆస్తుల డాక్యుమెంట్ విలువ కంటే వాటి బహిరంగ మార్కెట్ విలువ అనేక రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. నార్సింగిలోని విల్లా ఒక్కటే బహిరంగ మార్కెట్లో సుమారు రూ.8 కోట్ల వరకు విలువ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ లాకర్లను తెరిచి పరిశీలించడం, భూముల పత్రాలను పూర్తిగా ధృవీకరించడం అనంతరం ఆస్తుల అసలు విలువపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భీమ్ రెడ్డికి చెందిన మొత్తం ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.