. . . ఏఐఎస్‌బీ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు ఫోర్జరీ చేసిన ఎన్‌ఓసీలతో అనుమతులు పొందిన వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌బీ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 180 కళాశాలలు హైడ్రా కమిషనర్, ఫైర్ సేఫ్టీ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసి అనుమతులు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడినట్లు తేలిన కళాశాలల గుర్తింపును రద్దు చేయడంతో పాటు సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫోర్జరీ ఎన్‌ఓసీలతో పాటు ఆయా కళాశాలలకు సంబంధించిన శానిటేషన్, ట్రాఫిక్ ఎన్‌ఓసీలపై కూడా విచారణ జరపాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలలు పొందిన అనుమతులు, ఎన్‌ఓసీలు, గుర్తింపు పత్రాలను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీఐఈఓల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరపాలని రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. అక్రమాలకు అధికారుల సహకారం ఉందనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ, ఏసీబీ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల అనుమతులు, ఎన్‌ఓసీలు, గుర్తింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని అన్నారు. తద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలల గుర్తింపు, అనుమతుల వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించని, గుర్తింపు లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే వాటిని సీజ్ చేయాలని బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు.