Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 6:36 pm Posted by : ramakrishna

రైతులకు, ప్రజలకు అనూకులమైన బడ్జెట్

 

. . . తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై ప్రభుత్వ సలహాదారు అలీ ప్రశంసలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇది రైతులకు, ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అని, సామాజిక న్యాయాన్ని బలపరుస్తూ, ముఖ్యంగా మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సమర్పించిన బడ్జెట్‌ను ఆయన ప్రశంసించారు. మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం పట్ల షబ్బీర్ అలీ స్వాగతం పలికారు. ఇది వారి సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు యంత్రాల పంపిణీ, 4,655 మంది మైనారిటీ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంలో, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో మైనారిటీలను సంక్షేమ ప్రణాళికల కేంద్రంగా ఉంచి, విద్య, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్వతంత్రతపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర వర్గాల యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలు ఏర్పాటు చేయబడుతున్నాయని, అందులో 79 పాఠశాలలకు అనుమతులు లభించగా, 44 చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్య ఆధారిత విద్యను అందిస్తుందని అన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రూ.36,000 కోట్లకు పైగా కేటాయించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్సీలకు రూ.11,784 కోట్లు, ఎస్టీలకు రూ.7,937 కోట్లు, బీసీలకు రూ.12,511 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలతో పాటు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాల విస్తరణ ద్వారా చారిత్రక అసమానతలను తగ్గించి, వెనుకబడిన వర్గాలకు ప్రయోజనాలు చేరేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశంసిస్తూ, ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించిందని, రైతులు, బలహీన వర్గాలు, యువతకు ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా సమగ్ర పాలనకు కొనసాగింపని పేర్కొన్నారు.