హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ డైరెక్షన్ లో పని చేస్తున్నారని, ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి అంటున్నారని, లేనిపోని విషయాలు తెచ్చి తమకు అంటగడుతున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదన్నారు. తామెన్నడూ ప్రొటోకాల్ ను ఉల్లంఘించలేదని, కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్ చార్జి అని సీఎం చెప్పుకున్నారని, పార్టీ పరంగా ఇన్ చార్జి అయితే తమకు ఇబ్బంది లేదని, కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు.
