- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, బతుకమ్మ : స్పెషల్ లోక్ అదాలత్ లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో రాజీపడి 4898 కేసులు పరిష్కరించబడ్డాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 20,96,406-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ లోక్ అదాలత్ లో భాగంగా నిజామాబాదు జిల్లా కు సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీ మార్గం చేసినందుకు, సైబర్ క్రైమ్ సిబ్బంది, కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని తెలిపారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో డీ4సీని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే పర్యాయవేక్షించడం జరుగుతుందన్నారు. నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ స్పెషల్ లోక్ అదాలత్ నందు 111 సైబర్ క్రైమ్ కేసులలో 20,96,406 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ వై.వెంకటేశ్వర్ రావ్, సీఐ ముఖిద్ పాషా, సీసీఆర్బీ సీఐ అంజయ్య, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య అభినందించారు.