Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2025, 3:05 pm Posted by : ramakrishna

42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

  • బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్ర
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ ను సోమవారం తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు వేర్వేరు బిల్లులు పాస్ చేసిందని తెలిపారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల పరంగా అవకాశం కల్పించడం కాదు.. బీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే రైల్ రోకోకు పిలుపునిచ్చామని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన రైల్ రోకో చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైల్ రోకోకు సింగరేణి జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, బీసీ రిజర్వేషన్ల కల్పన, రైల్ రోకో అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. జూలై 16, 17, 18 తేదీల్లో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు.

42 percent reservation should be provided