- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర బస్సు జాత శుక్రవారం నిజామాబాద్ జిల్లా నాందేవాడ సిపిఎం ఆఫీస్ కి చేరుకుంది. ఈ సందర్భంగా ఐద్వా నిజాంబాద్ జిల్లా కమిటీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడారు. పూలే, అంబేడ్కర్ ఆశయాలు అమలు జరపడం కోసమే ఐద్వా నడుం బిగించిందని ఈ బస్సు జాత ముఖ్య ఉద్దేశం అన్నారు. మహిళలపై హింసను అరికట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యా వైద్యం ఉద్యోగం అందించాలని, ఉచిత పథకాలు పెట్టకుండా అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, తినడానికి తిండి ఉండడానికి ఇల్లు, చేతి నిండా పని కల్పించి మహిళలకు నిరుపేదలకు ఆర్థికంగా మెరుగు పడే విధంగ ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి హక్కుల కోసం ప్రత్యేక పోరాటాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ బస్సు జాతాలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాయి లీల ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యులు రజియా, మాధవి, కళావతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.