Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 9:48 pm Posted by : ramakrishna

32 పట్టభద్రుల నామినేషన్ ల తిరస్కరణ

  • ఉపాధ్యాయుల నామినేషన్  1 తిరస్కరణ

 

కరీంనగర్, బతుకమ్మ: మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది.  పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా 32 మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సరైన ఫార్మాట్ లో ఉన్న 68 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. 16 మంది నామినేషన్లు ఆమోదించారు. మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నామినేషన్ వేసిన వారి సమక్షంలో నిర్వహించారు.

  • నిబంధనల ప్రకారం పరిశీలన ప్రక్రియ
  • ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి

ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ల సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. కొంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. నియమ నిబంధనలను అనుసరించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగిందని తెలిపారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం నామినేషన్ తీసుకునే తేదీల్లో హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం అభ్యర్థుల నుండి అభ్యంతరాలు కోరారు. తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, ఏవో నరేందర్, తహసిల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

32 Rejection of nominations of officers