- లక్కీ డ్రాలో విజేతలుగా మహిళలు
- ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని భారతీ గార్డెన్ లో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుక కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ 49 మద్యం దుకాణాలను లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. ఉమ్మడి జల్లాలో 31 మంది మహిళలకు మద్యం షాపులు దక్కాయి. ఇందూర్ లో 19, కామారెడ్డి జిల్లాలో 12 మందికి లిక్కర్ షాపులు దక్కాయి.

నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ షాప్ నంబర్ 1, దూద్ గాం మద్యం షాపులు భార్యా భర్తలకు దక్కాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ షాప్ నంబర్ 3, ఎల్లారెడ్డి షాప్ నంబర్ 1 హైద్రాబాద్ లోని షేక్ పేట్ కు చెందిన మంద రమేష్ లకు దక్కాయి. ఉమ్మడి జల్లాలో నాలుగు మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు దళితులు కావడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా ఏర్గట్లకు చెందిన వ్యక్తికి వరుసగా రెండో ఏడాది మద్యం దుకాణం దక్కడం గమనార్హం. నిజామాబాద్ నుడా మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పోరేటర్ కౌడపు ఉమారాణీలకు మద్యం దుకాణాల లక్కీ విజేతలుగా దక్కించుకున్నారు.

- సిండికేట్ వ్యాపారుల వల..
మద్యం వ్యాపారం గుత్తాధిపత్యం కలిగిన మద్యం వ్యాపారులు తమకు దక్కని షాపులను దక్కించుకునే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో సిండికేట్ వ్యాపారులు ఒక్కో గ్రూప్ గా ఏర్పడి వందకు పైగా దరఖాస్తులు చేశారు. అందులో చాల మటుకు రిజర్వేషన్ స్థానాలలో సిండికేట్ మద్యం దుకాణాలకు రిజర్వు అభ్యర్థుల ద్వారా టెండర్లు దాఖలు చేయించడం విశేషం. సోమవారం మద్యం దుకాణాలను లక్కీ డ్రా విజేతల ద్వారా ప్రకటించడంతోనే బేరసారాలు సాగించడం విశేషం. మద్యం దుకాణాలను దక్కించుకున్న కన్పర్మేషన్ లెటర్ (నౌకరి నామా) అందకముందే కొనుగోళ్లకు తెరలేపారు. 65 లక్షలు స్లాబ్ రేట్ కలిగిన మద్యం దుకాణాలను కోటికి కొనేందుకు సిద్ధమవ్వడం విశేషం. తెలంగాణ జిల్లా వారే బరిలో ఉండాలని నిబంధన ఉండటంతో హైద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారు కుడా దరఖాస్తులు చేసి దక్కించుకోవడం విశేషం. మద్యం దుకాణాలను దక్కించుకున్నవారు 1/6 వంతు చెల్లింపులకు మంగళవారం వరకు అవకాశం ఉండటంతో నౌకరినామా చేతిలో పడేవరకు లైసెన్స్ ల అమ్మకాలు ఏమేరకు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. డిసెంబర్ 1 నుంచి మద్యం అమ్మకాల ప్రారంభ సమయం కావడంతో అప్పటి వరకు సిండికేట్ గుప్పిట ఎన్ని వైన్ షాపులు వస్తాయో వేచి చూడాల్సిందే.
