Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 11:26 am Posted by : ramakrishna

పుష్కరస్నానమాచరించిన 30 లక్షల మంది భక్తులు

వైభవంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు

చివరి రోజూ బారులు తీరిన భక్తులు

కాళేశ్వరం, బతుకమ్మ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 12 రోజుల పాటు జరిగిన సరస్వతి పుష్కరాలు సోమవారం రాత్రి 8.10 గంటలకు వైభవంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా సరస్వతి మాతకు విశేష పూజలు నిర్వహించారు. సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన నవరత్నమాల హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సరస్వతి పుష్కరాల ప్రత్యేకతను, కాళేశ్వర క్షేత్ర వైభవాన్ని ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణిశర్మ వివరించారు. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు త్రివేణి సంగమంలో సుమారు 30 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే సుమారు 2.5 లక్షల మంది హాజరయ్యారు.  అన్ని ఘాట్లు భక్తులతో నిండిపోగా, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్ల దర్శనానికి   బారులు తీరారు. చివరి రోజు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, శైలజారామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో సరస్వతి పుష్కరాలను విజయవంతం చేశామని, ఈఅనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.