నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 21న హైదరాబాదులో జరిగే లెనిన్ శతవర్ధంతి ముగింపు సభ పోస్టర్లను పార్టీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రామిక భవన్, కోటగల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ జనవరి 21, 2024 నాటికి మార్క్సిస్టు మహోపాధ్యాయులలో ఒకరైన కా॥ లెనిన్ అమరుడై వంద సంవత్సరాలు నిండుతున్నదన్నారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంపాటు 2024 జనవరి 21 నుండి 2025 జనవరి 21 వరకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కృషిని తెలియజేయాలనీ, రచనలను అధ్యయనం చేయాలనీ, సభలు, సమావేశాలు నిర్వహించాలనీ పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగా చివరగా జనవరి 21 లెనిన్ వర్ధంతి రోజున హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో (ఎస్వీకే) ఒక రోజంతా లెనిన్ రచనల మీద ప్రసంగాలు చేయించాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులనూ, మేధావులను, మార్క్సిస్టులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్, డివిజన్ సహాయ కార్యదర్శి సాయన్న, జిల్లా నాయకులు మురళి, డివిజన్ నాయకులు లింగం, కర్క గణేష్, సాయిబాబా, మహేష్, నారాయణ, రాందాస్, శకుంతల, గంగాధర్, మోహన్, లలిత, లింగం, నసీర్ , సృజన్, రాజు తదితరులు పాల్గొన్నారు.