. . . జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే అన్ని ఎన్నికల్లో దళిత అభ్యర్థులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ సూచన మేరకు ఈ వినతిపత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. వినతిపత్రంలో, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసిందని, 2026లో కూడా అదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే, భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అమలవుతున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయ రంగంలో కూడా ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల సాధికారత లక్ష్యాలతో రూపొందించబడిందని, రాజకీయ రంగంలో దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి మరింత సమర్థవంతంగా చేరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రంపై బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి శివ ప్రసాద్ & ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు సంజీవ్, మురళీకృష్ణ శీలం రఘు, శివ, శంకర్ పాల్గొన్నారు.
