నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని,వారందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారు.కానీ ఈ ప్రభుత్వం సుమారు 8000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, రంజిత్, దుర్గా దాస్, ఇంద్రసేన, దినేష్, శ్రీకర్, యోగేష్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.