- ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలి
బతుకమ్మ భిక్కనూరు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు…విశ్వవిద్యాలయాలకు వాటి బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ పెంచకుండా ప్రైవేటు యూనివర్సిటీల వలె విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి దాపరించిందన్నారు. అన్ని యూనివర్సిటీల్లో స్వీయ ఆర్థిక స్వావలంబన ఫీజులు పెంచి విద్యార్థుల రక్తం తాగుతున్నారన్నారు. రాష్ట్ర పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో ఇది వరకే మంజూరు అయినా టీచింగ్ పోస్టులు 2878 అయితే ప్రస్తుతం కేవలం 753 మంది మాత్రమే టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నది అంటే 70% ఖాళీలతో కాలం వెళ్లదీస్తున్నాయన్నారు. 3 స్పెషలైజ్డ్ యూనివర్సిటీల్లో 50% ఖాళీలు దర్శనమిస్తున్నాయన్నారు. యూనివర్సిటీలకు వీసీ లను నియమించి చేతులు దులుపుకున్నారని అని అన్నారు. వెంటనే రాష్ట్ర బడ్జెట్ లో 15% విద్యారంగానికి కేటాయించాలి అని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో విద్యార్థి, నిరుద్యోగ సమాజం ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించబోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమీర్ ఖాన్, నరేందర్ ఉన్నారు.