. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత
. . . రేషన్ సమస్యలపై ఐద్వా డోర్ టు డోర్ క్యాంపెయిన్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడ అంగన్వాడీ కేంద్రం పరిధిలో శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత, జిల్లా అధ్యక్షురాలు అడివాలా అనిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 14 రకాల వస్తువులు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యానికి కూడా ఆంక్షలు విధిస్తూ నగదు బదిలీ విధానాన్ని తీసుకురావడం సరైన చర్య కాదని అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందేందుకు అది ప్రధాన ఆధారమని వారు పేర్కొన్నారు. పిల్లల స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ వంటి అనేక పథకాలకు రేషన్ కార్డు అవసరమని తెలిపారు. గతంలో 2007లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగిందని, అప్పట్లో ఐద్వా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు.

మళ్లీ ఇదే సమస్య తెరపైకి రావడంతో ప్రజలంతా స్పందించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. రేషన్ ద్వారా వస్తువులు అందించకుండా కేవలం డబ్బులు జమ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకుని 14 రకాల వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
